Donald Trump | అమెరికా అధ్యక్ష (US President) ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రత్యర్థి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పై ప్రశంసల వర్షం కురిపించారు. వివేక్ చాలా చాలా తెలివైన వ్యక్తి అని, తన ప్రభుత్వంలో ఆయనను గొప్ప ఉపాధ్యక్షుడిని చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అతను (వివేక్ రామస్వామి) చాలా చాలా తెలివైన వ్యక్తి. ఎంతో చురుగ్గా ఉంటారు’ అని అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ‘వివేక్ రామస్వామికి ఉపాధ్యక్ష పదవి ఇస్తారా..?’ అన్న ప్రశ్నకు ట్రంప్ ‘అతను నా ప్రభుత్వంలో గొప్ప ఉపాధ్యక్షుడు కాగలడు’ అని బదులిచ్చారు.
అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికలపై వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో వివేక్ రామస్వామి పాప్యులారిటీ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి చర్చ తర్వాత వివేక్ రామస్వామి పేరు ప్రపంచ మంతా మార్మోగుతోంది.
రిపబ్లిక్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా 8 మంది పోటీపడుతున్నారు. ఇందులో భారత సంతతి మహిళ నిక్కీ హేలీ కూడా ఉన్నారు. తొలి చర్చలో ట్రంప్ గైర్హాజరీ కావడంతో వివేక్ కీలకంగా నిలిచినట్టు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ డిబేట్లో వివేక్ రామస్వామి తన ఉత్సాహం, వాక్చాతుర్యం, స్పష్టమైన రీతిలో అభిప్రాయాల వ్యక్తీకరణతో రిపబ్లికన్ పార్టీ అభిమానులు, కార్యకర్తల మద్దతు పొందారంటూ అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇక ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు, ఇతర అంశాలపై వివేక్ అభిప్రాయాలు అనేక మందిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం రేటింగ్స్ పరంగా వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు. తొలి రెండు స్థానాల్లో డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ ఉన్నారు.
Also Read..
Adani | అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే ప్రధాని మోదీ గ్రీస్ పర్యటన ! కోడైకూస్తున్న ఆ దేశ మీడియా
MLC Kavitha | ఎంపీ సంతోష్ కుమార్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత
Rave party | హైదరాబాద్‌లో రేవ్‌పార్టీ భగ్నం.. సినీ నిర్మాత సహా ఐదురుగురు ప్రముఖులు అరెస్టు