Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలు చేస్తారని విపక్ష పార్టీలు విమర్శిస్తుంటాయి. ఇప్పుడు, గ్రీక్ మీడియా కూడా దాదాపుగా ఇవే ఆరోపణలు చేస్తున్నది. నలభై ఏండ్ల తరువాత తొలిసారి గ్రీస్‌లో భారత ప్రధాని మోదీ ఇటీవల పర్యటించారు. అయితే, మోదీ పర్యటన అసలు ఉద్దేశం అదానీ బిజినెస్ విస్తరణేనని అక్కడి మీడియా ఆరోపించింది. గ్రీస్‌లోని ఓడరేవుల కోసం ఈ పర్యటనలో మోదీ ప్రత్యేక ఆసక్తి కనబరచడమే కాకుండా, వాణిజ్యం పేరిట పలు ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తుచేసింది. అయితే, గ్రీస్‌లోనే అతిపెద్ద ఓడరేవు అయిన పిరయస్తో పాటు మరికొన్ని పోర్ట్‌ల కోసం అదానీ గ్రూప్ టెండర్లకు ప్రయత్నించిందని, ఇందులో భాగంగానే ప్రధాని గ్రీస్‌లో పర్యటించారని బిజినెస్ డైలీ గ్రీస్, గ్రీక్ సిటీ టైవ్ తదితర పత్రికలు పేర్కొన్నాయి. కాగా, అదానీ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చడానికి వివిధ దేశాల్లో ప్రధాని మోదీ నలభైకి పైగా పర్యటనలు చేసినట్టు విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రధాని పర్యటన తేదీలు.. అదానీ గ్రూప్‌తో ఆయా దేశాల్లోని కంపెనీల ఒప్పందాలను లోతుగా విశ్లేషిస్తే, ఇది నిజమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2014 మేలో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరక్కుండానే నవంబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన.. అక్కడి ప్రభుత్వంతో దౌత్య సంబంధాల్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకొన్నారు. ఒప్పందంలో భాగంగా దేశంలో భారీ రైల్వే, మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
ఈ కాంట్రాక్టులు అనూహ్యంగా అదానీ గ్రూప్‌నకే దక్కాయి. 2015 ఏప్రిల్‌లో ప్రధాని ఫ్రాన్స్ పర్యటన జరగ్గా.. అదానీ గ్రూప్‌తో రాఫెల్ కంపెనీ ఓ ఒప్పందం కుదుర్చుకొన్నది. అదే ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన మోదీ.. మళ్లీ అదానీ గ్రూప్‌నకు విద్యుత్తు కాంట్రాక్టు వచ్చేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే ఏడాది నవంబర్‌లో మలేషియాలో పర్యటించిన అనంతరం 2017లో అదానీ గ్రూప్‌నకు ఆ ప్రభుత్వం ఐలాండ్ పోర్టు కట్టబెట్టింది. 2016 ఫిబ్రవరిలో స్వీడన్, మార్చిలో ఇజ్రాయెల్, జూన్‌లో అమెరికా, జూలైలో మొజాంబిక్, నవంబర్‌లో జపాన్‌లో మోదీ పర్యటించగా.. అదానీ గ్రూప్‌తో ఆయా ప్రభుత్వాలు పలు ఒప్పందాలు కుదర్చుకున్నాయి. 2017 నుంచి 2023 వరకు వివిధ దేశాల్లో మరో 30 పర్యటనలను మోదీ పూర్తిచేయగా ఆయా దేశాల్లోని కంపెనీలు అదానీ గ్రూప్‌తో పలు ఒప్పందాలు చేసుకొన్నట్టు సమాచారం.