పాట్నా: పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను (Bihar Teacher Recruitment Exam) రద్దు చేశారు. ఈ నెల 15న రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసినట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) బుధవారం తెలిపింది. తిరిగి నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.
కాగా, బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష 2024 (టీఆర్ఈ 3.0)కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు నిర్ణీత సమయానికి ముందే ఒక ముఠాకు చేరాయని ఆ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం తెలిపింది. దీంతో పరీక్షకు ముందుగానే పేపర్ లీక్ అయ్యిందని ఆరోపించింది. ఈ నెల 16న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది.
మరోవైపు ఈ ఆరోపణలపై తగిన ఆధారాలు చూపాలని ఆర్థిక నేరాల విభాగాన్ని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోరింది. అయితే నిబంధనల ప్రకారం సీల్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆధారాల గురించి వెల్లడించలేమని బదులిచ్చింది. ఈ నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, సమగ్రత నేపథ్యంలో టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) ప్రకటించింది.