Rohit Pawar | మహారాష్ట్రలో గత పదేండ్లలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యేలు, పార్టీల నేతలను తమతో చేర్చుకునేందుకు బీజేపీ, శివసేన ఆత్రుత కనబరిచేవి. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారధ్యలోని కూటమికి మహారాష్ట్రలో 48 సీట్లకు కేవలం 17 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ సారధ్యంలోని చీలిక వర్గం ఎమ్మెల్యేల్లో అంతర్మధనం మొదలైనట్లు తెలుస్తున్నది. వచ్చే అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కనుక ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గంలో ఉన్న 16-18 మంది ఎమ్మెల్యేలు బయటకు రావాలని యోచిస్తున్నారని, శరద్ పవార్‌తో సంప్రదిస్తున్నారని ఎన్సీపీ (ఎస్సీ) అధినేత శరద్ పవార్ మనుమడు రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
48 లోక్ సభా స్థానాల్లో 288 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల ప్రకారం శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) కూటమి 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 144 మంది సభ్యుల మద్దతు ఉంటే చాలు. బీజేపీ ఎంపీలకు బలమైన నియోజకవర్గాల్లోనూ విపక్ష కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో అధికార పక్షం ఎమ్మెల్యేల్లో భయం మొదలైంది. బీజేపీ సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలోనే కొనసాగితే తాము తిరిగి గెలుస్తామా? అని బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాల ఎమ్మెల్యేలు మదన పడుతున్నారని సమాచారం.
ఎన్సీపీలో 40 మంది ఎమ్మెల్యేలను చీల్చి అజిత్ పవార్.. ఏక్ నాథ్ షిండే సారధ్యంలోని ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎంగా చేరారు. లోక్ సభ ఎన్నికల ముందే అజిత్ పవార్‌ను వీడి శరద్ పవార్‌తో చేరారు. తాజా లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగానూ ఎన్నికయ్యారు. గురువారం పరిస్థితిని సమీక్షించేందుకు అజిత్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని సమాచారం. ముందస్తు కార్యక్రమాలు ఉండటం వల్లే అందరూ రాలేకపోయారని ఆ పార్టీ వర్గాల కథనం.