Jai Shankar | భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యాతో సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇటీవల, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు. తాజాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సైతం రష్యాను సందర్శించి, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ నెల 21న మాస్కోలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సమావేశం అవుతారని సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ సమావేశంలో కీలక అంశాల్లో సహకారంతో పాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సైనిక సాంకేతిక సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భారతదేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం ఈ సమాచారాన్ని వెల్లడించింది. అలాగే, పౌర విమానాల తయారీ, మెటలర్జికల్ పరిశ్రమ, రసాయన పరిశ్రమ వంటి ఇతర వ్యూహాత్మక రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి.