లక్నో: భార్యతో గొడవ వల్ల ఒక వ్యక్తి తన ఇంటికి నిప్పు (House On Fire) పెట్టాడు. దీంతో అతడితోపాటు సహాయం కోసం వచ్చిన బంధువులు, పొరుగింటి వ్యక్తులకు కూడా కాలిన గాయాలయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ శివారున ఉన్న లోని ప్రాంతమైన తిలక్ నగర్ కాలనీకి చెందిన 40 ఏళ్ల సురేష్‌కు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై 36 ఏళ్ల భార్య రీతు, సురేష్ మధ్య శుక్రవారం గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన సురేష్, చంపుతానని తన భార్యను బెదిరించాడు. అంతటితో ఆగక వంట గదిలోని స్టవ్‌కు ఉన్న గ్యాస్ సిలిండర్ పైప్‌ను బయటకు తీశాడు. దీంతో గ్యాస్ ఆ గదంతా వ్యాపించింది.
కాగా, సురేష్ భార్య రీతూ ఇది చూసి భయాందోళన చెందింది. సహాయం కోసం కేకలు వేసింది. కుటుంబ సభ్యులతోపాటు పొరుగిళ్లకు చెందిన వారు కూడా అక్కడకు వచ్చారు. గ్యాస్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే సురేష్ అంతలోనే చేతిలో ఉన్న లైటర్‌ను వెలిగించాడు. దీంతో గ్యాస్ వ్యాపించిన ఆ గదిలో మంటలు చెలరేగాయి.
మరోవైపు ఈ సంఘటనలో సురేష్, అతడి కుటుంబ సభ్యులు, పొరుగింటి వ్యక్తులతో సహా పది మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని వెంటనే ఢిల్లీలోని జీబీటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటన వివరాలు తెలుసుకున్నారు. సురేష్ కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్న తర్వాత అతడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.