ఈ నెల 19న మధ్యాహ్నం సాక్షాత్కారం
కోల్కతా, నవంబర్ 13: ఈ నెల 19న(శుక్రవారం) అత్యంత అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. గడిచిన 580 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత సుదీర్ఘ కాలం పాటు గ్రహణం కనిపించనున్నది. ఈశాన్య భారతంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని పలు ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం గ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4.17 గంటలకు వీడుతుంది. అంటే మూడు గంటల 28 నిమిషాల 24 సెకండ్లు గ్రహణం ఉంటుందన్నమాట. 1440, ఫిబ్రవరి 18న ఈ తరహా చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్లీ 2,669 సంవత్సరంలో ఫిబ్రవరి 8న ఇంత సుదీర్ఘమైన గ్రహణం ఏర్పడుతుంది.