శ్రీనగర్: అంతుపట్టని అనారోగ్యం బారినపడి జనం మరణిస్తున్నారు. ఈ మిస్టరీ మరణాలపై (Mystery Deaths) కలకలం చెలరేగింది. ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వైద్య బృందంతో సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పురుగుమందుల షాపులను మూసివేశారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధల్ గ్రామ ప్రజలు వింత వ్యాధితో అనారోగ్యం బారిన పడుతున్నారు. గత రెండు నెలల్లో 17 మంది చనిపోయారు. వారి మరణాలకు కారణం ఏమిటో అన్నది అంతుపట్టడం లేదు. మరో 11 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందారు.
కాగా, ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుల బృందం రాజౌరీ జిల్లాలో మూడు రోజులు పర్యటించింది. బుధల్ గ్రామంలో వింత వ్యాధి బారిన పడిన రోగులను డాక్టర్లు పరీక్షించారు. 17 మంది ఆకస్మికంగా మరణించడంపై దర్యాప్తు జరిపారు. పలు ప్రాంతాల నుంచి వివిధ నమూనాలను సేకరించారు. ఆర్గానోఫాస్ఫరస్ విషప్రయోగం ఈ మిస్టరీ మరణాలకు కారణమని అంచనా వేశారు.
మరోవైపు ఎయిమ్స్ వైద్య బృందంతో ప్రత్యేక సమావేశం తర్వాత జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పురుగుమందులు, ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి సీల్ వేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆ షాపులను మూసి ఉంచాలని ఆదేశించారు.