చండీగఢ్: పంజాబ్‌కు చెందిన రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించారు. (Farmer leader ends hunger strike) అయితే డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను కోరారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ, ఇతర రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్యల కోసం గత ఏడాది నవంబర్ 26న జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో రైతు సంఘాలు ఆందోళన చెందాయి.
ఈ నేపథ్యంలో ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరాహార దీక్ష ముగించాలని రైతుల సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలో శనివారం హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్న జగ్జీత్ సింగ్ దల్వాల్, రైతుల విన్నపం మేరకు ఆమరణ నిరాహార దీక్షను ఆదివారం ముగించారు. అయితే డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను ఆయన కోరారు.
మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు కూడా నిరాహార దీక్షను విరమించాలని జగ్జీత్ సింగ్ దల్వాల్‌ను శనివారం కోరారు. రైతుల డిమాండ్లపై రైతు సంఘాల ప్రతినిధులతో మే 4న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని బిట్టు హామీ ఇచ్చారు. ‘మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. పంజాబ్ ప్రజలకు మీ జీవితం విలువైనది. రైతులు, రైతు కూలీల పోరాటానికి మీ నాయకత్వం ఎల్లప్పుడూ అవసరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.