Aditya L1 | బెంగళూరు, సెప్టెంబర్ 2: సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత్ ప్రయోగించిన మొదటి శాటిలైట్ ఆదిత్య-ఎల్1ను భూమికి 15 లక్షల కి.మీ దూరంలోని ఎల్-1 పాయింట్ వద్దనున్న సుదీర్ఘమైన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. తద్వారా సౌర మంటలు, కొరొనల్ మాస్ ఎజెక్షన్, సౌర గాలులు తదితర అంశాలపై ఇస్రో దృష్టి సారించనున్నది. దీంతో పాటు ఇప్పటి వరకు మిస్టరీగా ఉన్న అనేక అంశాలపై అధ్యయనం చేయనున్నది. సూర్యుడికి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది.. కొరొనా వద్ద ఎక్కువ వేడి ఎందుకున్నది.. తదితర రహస్యాలను ఛేదించే అవకాశం ఇస్రోకు లభిస్తుంది. ఇప్పటి వరకు సూర్యుడికి సంబంధించి నాలుగు అంతుచిక్కని రహస్యాలపై శాస్త్రవేత్తలు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
కొరొనా మిస్టరీ…
సూర్యుడి ఉపరితలంతో పోలిస్తే దాని బయటి వాతావరణం ఎక్కువ వేడిగా ఉంటుంది. సూర్యుడి ఉపరితలంతో పోలిస్తే సుమారు వెయ్యి రెట్లు ఎక్కువ ఉష్ణం అక్కడ ఉంటుంది. కొరొనా అని పిలిచే ఈ బయటి వాతావరణంలో సూర్యుడి ఉపరితలం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి ఎందుకు ఉన్నది అనే.. విషయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు.
సన్స్పాట్స్…
సూర్యుడి ఉపరితలంపై ఉండే అయస్కాంత క్షేత్రాలను సన్స్పాట్స్గా పిలుస్తారు. సూర్యుడి వాతావరణంలోనూ ఈ సన్స్పాట్స్లను గుర్తించారు. అక్కడ వీటిని కొరొనల్ లూప్స్గా పేర్కొంటారు. సూర్యుడి లోపలి భాగంలో ఈ అయస్కాంత క్షేత్రాలు ఉత్పత్తి అవుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది తేలాల్సి ఉంది.
11 ఏండ్ల సర్కిల్…
సూర్యుడిలో సన్స్పాట్లు, అయస్కాంత క్షేత్రాలు ప్రతి 11 ఏండ్లకు ఒకసారి మార్పులకు లోనవుతాయి. సూర్యుడి చక్రం ప్రారంభంలో సాధారణంగా సూర్యుడి మచ్చలు మధ్య-అక్షాంశాల చుట్టూ కనిపిస్తాయి. క్రమంగా సూర్యుడి చక్రం పురోగమిస్తున్నకొద్దీ ఈ మచ్చలు భూమధ్య రేఖకు దగ్గరగా కనిపిస్తాయి. ఈ చక్రం సాధారణంగా 11 ఏండ్లకు ఒకసారి జరుగుతుంది. సూర్యుడి ఉపరితల లక్షణాలు తక్కువ కాలపరిమితితో మారుతుంటాయి.
సౌర తుఫానులు
సౌర వ్యవస్థలో జరిగే మార్పుల కారణంగా భూమిపై వాతావరణం వేడెక్కి అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. శాటిలైట్ల పనితీరుపై ప్రభావం, కమ్యూనికేషన్ కోల్పోవడం తదితర కారణాల వల్ల లక్షల కోట్ల డాలర్ల నష్టం వస్తున్నది. సూర్యుడి సూపర్ఫ్లేర్స్ కారణంగా భూమిపై దుష్పరిణామాలు సంభవిస్తుండటంతో చంద్రుడు, అంగారక గ్రహంపై మానవాళి నివాసం కోసం అన్వేషణ కొనసాగుతున్నది. సౌర వ్యవస్థలో జరుగుతున్న మార్పులకు అయస్కాంత క్షేత్రాలకు సంబంధం ఉంటుంది. అయస్కాంత క్షేత్రాలను మెలితిప్పడం (ట్విస్టింగ్) వల్లనే అయస్కాంత శక్తి విడుదల అవుతున్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.