హైదరాబాద్, సెప్టెంబర్ 30 : అమెరికాకు చెందిన అతిపెద్ద కామర్స్ ప్లాట్‌ఫామ్ సేవల సంస్థ డోర్‌డాష్..భారత్‌లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో నెలకొల్పిన తన తొలి కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ అంతర్జాతీయ కంపెనీలకు అడ్డాగా మారిపోయిందని, ఇప్పటికే అమెజాన్, వాల్‌మార్ట్, ఫెడెక్స్, జొమాటో, ఉబర్, స్విగ్గీ వంటి సంస్థలు ఇక్కడ తమ గ్లోబల్ కార్యాలయాలను ఏర్పాటు చేయగా, తాజాగా ఈ జాబితాలోకి డోర్‌డాష్ కూడా చేరిందన్నారు.
ప్రస్తుతం ఈ కార్యాలయంలో 500 మంది టెక్నాలజీ నిపుణులు విధులు నిర్వహిస్తుండగా, వచ్చే రెండేండ్లకాలంలో వీరి సంఖ్యను 3 వేలకు పెంచుకోనున్నట్టు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రవి ఇనుకొండ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మూడో అంతర్గత కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటిగ్రిటీ సెంటర్ ఇదే కావడం విశేషమని, భవిష్యత్తులో ఈ సెంటర్‌ను హబ్‌గా మార్చే అవకాశం కూడా ఉందన్నారు. ఈ హబ్..డోర్డాష్నకు ప్రపంచవ్యాప్త కార్యకలాపాలకు మద్దతు ఇవ్వనున్నదని, అలాగే కంపెనీ విస్తరించివున్న ప్రాంతాల్లో వినియోగదారులు, వ్యాపారులకు మరింత నమ్మకమైన సేవలు అందించడానికి వీలు పడనున్నదని పేర్కొన్నారు. 40కి పైగా దేశాల్లో సేవలు అందిస్తున్న సంస్థ లావాదేవీలు 100 బిలియన్ డాలర్లు దాటాయి.