Adani | హైదరాబాద్, ఆగస్టు 15 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ కంపెనీకి చెందిన అదానీ పవర్‌కు మేలు చేసేలా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యుత్తు సవరణలు చేసింది. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంతిమంగా అదానీ పవర్‌కు ఇబ్బందిగా మారడంతో సదరు కంపెనీ నష్టపోకుండా 2018లో తీసుకొచ్చిన రెగ్యులేటర్స్ సప్లయింగ్ ఎలక్ట్రిసిటీ నిబంధనలను కేంద్రం హడావుడిగా మార్చేసింది. సవరణలతో కూడిన మెమోను ఆగస్టు 12న విద్యుత్తుశాఖ జారీ చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ‘రాయిటర్స్’ ఓ సంచలన కథనంలో వెల్లడించింది.
జార్ఖండ్‌లోని గొడ్డాలోని 1600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవర్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తును బంగ్లా కొనుగోలు చేసేలా అదానీ పవర్ సంస్థ 2015 ఆగస్టులో బంగ్లాదేశ్‌లోని అప్పటి షేక్ హసీనా ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు అక్కడ రాజకీయ సంక్షోభంతో పవర్ డీల్‌పై నీలినీడలు కమ్మాయి. దీంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు జోక్యం చేసుకొంది. 2018లో చేసుకొన్న ఒప్పందంలోని నిబంధనలను మార్చేసింది. గొడ్డాలోని అదానీ పవర్ ప్లాంట్.. దేశీయ గ్రిడ్లకు విద్యుత్తు సరఫరా చేసుకోవచ్చని కొత్త మెమో ఇచ్చింది. ఈ మేరకు రాయిటర్స్ వెల్లడించింది. అయితే, అదానీని ఆదుకొనేందుకే కేంద్రం ఈ నిబంధనలను పక్షపాతపూరితంగా మార్చేసిందని పలువురు విమర్శిస్తున్నారు.
బంగ్లాదేశ్‌తో అదానీ కంపెనీ చేసుకొన్న పవర్ డీల్‌పై కూడా అప్పట్లో పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఒప్పందం కుదరడానికి ప్రధాని నరేంద్రమోదీ సాయపడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. 2015 జూన్‌లో మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. దౌత్య, వాణిజ్య సంబంధాల బలోపేతం పేరిట ఆ దేశంతో 4.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకొన్నారు. పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని అప్పటి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు హామీనిచ్చారు. అయితే, దీనికి ప్రతిగా జార్ఖండ్ గొడ్డాలోని అదానీ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలని, అదానీకి చెందిన విద్యుదుత్పత్తి, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను బంగ్లాలో స్థాపించేందుకు అనుమతినివ్వాలని మోదీ మెలికపెట్టినట్టు వార్తలు వచ్చాయి. కాగా, ఈ డీల్‌తో తాము నష్టపోతున్నట్టు గత ఏడాది బంగ్లాదేశ్ సవర్ డెవలప్మెంట్ బోర్డ్ (బీపీడీ) అదానీ కంపెనీకి ఓ లేఖ రాసింది.