పాట్నా : బీహార్ ప్రభుత్వం అదానీ కంపెనీకి కారుచౌకగా 1,020 ఎకరాల భూమిని కట్టబెట్టింది. భాగల్పూరు జిల్లా, పిర్పెయింటిలో ఉన్న ఈ భూమిని 25 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. సంవత్సరానికి ఎకరానికి రూ.1 లీజు ధరగా నిర్ణయించింది. తమకు నష్టపరిహారం అందలేదని రైతులు గగ్గోలు పెడుతున్న సమయంలో ఇది జరిగింది. మామిడి, లిచి పండ్ల తోటలు గల భూమిని లాక్కున్నారని అన్నదాతలు వాపోతున్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాన్ని నిర్మించేందుకు అదానీ పవర్‌కు ఈ భూమిని ఇచ్చారు. ఇప్పటికే బీహార్‌లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఇక్కడ విద్యుత్కేంద్రాన్ని నిర్మించడం వల్ల స్థానికులపై ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలు పడతాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. భారత దేశ వాతావరణ లక్ష్యాలను సాధించడం, పునరుత్పత్తి ఇంధన వనరులవైపు మళ్లడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 15న పూర్నియాలో దాదాపు రూ.40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో ఈ విద్యుత్కేంద్రం కూడా ఉంది. దీనిని అదానీ గ్రూప్ నిర్మిస్తున్నట్లు మోదీ చెప్పలేదు. అదానీ పవర్ రూ.25,000 కోట్లు పెట్టుబడి పెట్టి, ఉత్పత్తి చేసిన విద్యుత్తును బీహార్ రాష్ట్ర పవర్ యుటిలిటీస్‌కు ఒక కిలోవాట్ రూ.6.075కు అమ్ముతుంది.
తమ భూములకు నష్టపరిహారం ఏకరీతిగా లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క భూమికి ఒక్కొక్క విలువ కట్టి నష్టపరిహారం ఇవ్వడమేమిటని నిలదీస్తున్నారు. కొందరికి ఇప్పటికీ పూర్తి నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు. మొదట్లో దీనిని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ నిర్మిస్తుందని ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు అదానీ పవర్‌కు కట్టబెట్టారు. రాష్ట్రంలో ఇదే మొదటి, భారీ ప్రైవేట్ రంగ థర్మల్ పవర్ ప్లాంట్. భాగల్పూరు జిల్లాలో ఇప్పటికే 2,340 మెగావాట్ల సామర్థ్యం గల కహల్గావ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. దీనికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మరొక బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాన్ని నిర్మించడం అర్థరహితమని సుభాసిస్ డే అనే పరిశోధకుడు చెప్పారు. ఈ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే ధూళి కణాల వల్ల వాతావరణం కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.