చెన్నై, జనవరి 14: ‘బీజేపీ మాకు సైద్ధాంతిక శత్రువు, ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదు’ అని టీవీకే చీఫ్, తమిళ నటుడు విజయ్ మరోసారి తేల్చిచెప్పారు. బీజేపీతో సంబంధాలను పునరుద్ధరించిన ఏఐఏడీఎంకేతో కూడా తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ విచారణకు హాజరైన విజయ్, చెన్నైకి చేరుకున్న కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన విడుదలైంది. బీజేపీ తమ సైద్ధాంతిక శత్రువు.. అనే విధానంలో ఎలాం టి మార్పూ లేదని టీవీకే ప్రకటించింది. విజయ్ ‘జన నాయగన్’ విడుదలకు సీబీఎఫ్సీ ఆమోదం తెలుపలేదు. మరోవైపు తొక్కిసలాట కేసులో విజయ్‌కి సీబీఐ సమన్లు జారీ చేసింది. విజయ్ను తమ పార్టీలోకి తెచ్చేందుకే బీజేపీ ఈ కుట్రలు చేస్తున్నదని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు.