ఆయన భార్య కమల, కూతురు వీణకు భాగం
ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ ఆరోపణ
ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర: విజయన్
పాలక్కడ్, జూన్ 8: యూఏఈ నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పినరాయి విజయన్, ఆయన భార్య కమల, కూతురు వీణలకు భాగం ఉందని ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. వీరితో పాటు విజయన్ అడిషనల్ ప్రైవేట్ సెక్రెటరీ రవీంద్రన్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రెటరీ నళిని, అప్పటి మంత్రి కేటీ జలీల్ ప్రమేయం కూడా ఉందన్నారు. స్వప్న ఆరోపణలతో రాజకీయ దుమారం రేగింది.
విజయన్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. స్వప్న ఆరోపణలపై విజయన్ స్పందించారు. ఆ ఆరోపణలు నిరాధారమన్నారు. స్వప్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. 2020లో స్వప్న సురేశ్ తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌లో పనిచేస్తున్న సమయంలో ఆఫీసులో 15 కిలోల బంగారం దొరికింది. స్మగ్లింగ్‌తో సీఎం విజయన్‌కు సంబంధం ఉందని అప్పుడే ఆరోపణలు వచ్చాయి.