న్యూఢిల్లీ : మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తెలిపింది. పోషకాహారం, ఆరోగ్యంపై విస్తృత పరిశోధనలు, నిపుణులతో సంప్రదింపులు, క్షుణ్ణంగా నిర్వహించే సమీక్షల అనంతరం భారతీయుల కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ వివరాలను వెల్లడించింది. ఎన్ఐఎన్ తెలిపిన వివరాల ప్రకారం, మట్టి పాత్రలు పర్యావరణ హితమైనవి. వీటిలో వండటానికి నూనె అవసరం తక్కువ. పోషక విలువలను కాపాడే సామర్థ్యం ఈ పాత్రలకు ఉంటుంది. బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, హెడ్ ఆఫ్ సర్వీసెస్ ఎడ్వినా రాజ్ మాట్లాడుతూ, మట్టి పాత్రల్లో వండటం వల్ల వేడి అన్ని వైపులకు సమానంగా పంపిణీ అవుతుందని, ఆహారంలోని పోషక విలువలను కాపాడుకోవచ్చునని చెప్పారు. నాన్ స్టిక్ కోటింగ్ కోసం టెఫ్లాన్ ఉపయోగిస్తారని, దీనిపై ఆందోళన ఉండేదని, అయితే 2013 నుంచి దీనిని వాడటం మానేశారని చెప్పారు. కానీ నాన్ స్టిక్ ప్యాన్ను మితిమీరి వేడి చేయడం ప్రమాదకరమేనని తెలిపారు. నాన్ స్టిక్ కోటింగ్ ముక్కలైపోయి, హానికరమైన పదార్థాలను విడుదల చేయవచ్చునన్నారు. వీటివల్ల ఊపిరితిత్తులు దెబ్బతినవచ్చునని, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను ఎంచుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. మట్టిపాత్రలతోపాటు పింగాణి పాత్రలు కూడా సురక్షితమైనవేనన్నారు.