జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీలో ప్రశ్నల ఉప సంహరణకు రూ.20 లక్షలు లంచం తీసుకున్న ఎమ్మెల్యేను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదివారం అరెస్ట్ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి ప్రకాశ్ మెహర్ద తెలిపిన వివరాల ప్రకారం… భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) కి చెందిన జైకృష్ణ బగిడోర ఓ ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన వేరొక నియోజకవర్గంలోని గనుల గురించి మూడు ప్రశ్నలు శాసన సభకు సమర్పించారు. వాటిని ఉపసంహరించుకునేందుకు ఫిర్యాదుదారు నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేశారు.
చివరికి రూ.2.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. వెరిఫికేషన్ సమయంలో ఫిర్యాదుదారు ఆ ఎమ్మెల్యేకు రూ.1 లక్ష ఇచ్చారు. రూ.20 లక్షలు ఇవ్వాలని ఫిర్యాదుదారును ఎమ్మెల్యే కోరి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రమ్మని చెప్పారు. ఫిర్యాదుదారు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయనను కలిసి, నగదు ఉన్న బ్యాగ్‌ను ఇచ్చారు. ఆ సంచీని ఆయన మరొక వ్యక్తికి ఇచ్చారు. ఏసీబీ బృందం ఎమ్మెల్యేను ఈ సందర్భంగా ఘటనా స్థలిలో పట్టుకుంది. ఆ సంచిని తీసుకున్న వ్యక్తి నగదుతోపాటు అక్కడి నుంచి పారిపోయాడు. రాష్ట్రంలో అవినీతి కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి.