న్యూఢిల్లీ, జూలై 28: విద్యార్థులపై వేధింపులు ఆపకపోతే తాము మళ్లీ భారీ స్థాయిలో శాంతియుత నిరసన చేపడుతామని సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నీట్ అంశంపై జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను వేధిస్తున్నారంటూ ఆరోపణలు రావటంపై దీప్కే మంగళవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నిరసనల్లో పాల్గొంటున్న వారిని ప్రభుత్వం అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటున్నదని ఆయన ఆరోపించారు. ఇదిలాగే కొనసాగితే సీజేపీ నేతృత్వంలో భారీ నిరసన చేపడతామని అన్నారు.
సీజేపీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, ఆందోళనను విరమించటం అంటే ఉద్యమం ముగిసినట్టు కాదని దీప్కే పేర్కొన్నారు. నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సంస్కరణల కోసం తమ సంస్థ ప్రచారాన్ని కొనసాగిస్తుందని సీజేపీ నాయకులు చెబుతున్నారు. దీంతోపాటు యువతను ప్రభావితం చేసే అంశాలపై గళమెత్తడాన్ని కొనసాగిస్తామని సీజేపీ ప్రకటించింది.