జైపూర్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను సోమవారం జైపూర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఓ యువకుడు చెంప దెబ్బ కొట్టాడు. దీప్కే మద్దతుదారులు వెంటనే అతడిపై దాడి చేశారు. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థ, నిరుద్యోగ సమస్య మీద షహీద్ స్మారక్లో జరిగిన ధర్నాలో పాల్గొనడానికి దీప్కే వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. అంతకు ముందు వేదిక వద్ద నినాదాలు చేస్తుండగా కొందరు యువకుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
ధర్నా స్థలంలో తమ మొబైల్ ఫోన్లు చోరీ అయ్యాయని పలువురు నిరసనకారులు తెలిపారు. దీంతో ఫోన్లను భద్రంగా ఉంచుకోవాలని అక్కడ గుమికూడిన వారిని ధర్నా నిర్వాహకులు కోరారు. ధర్నాకు కొందరు మహిళలు తమ చిన్న పిల్లలతో సహా హాజరయ్యారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. పలువురు యువతీ యువకులు రాజ్యాంగ పుస్తకాలను చేత పట్టుకొని నిరసనకు హాజరయ్యారు.