న్యూఢిల్లీ : బీజేపీ అనుసరిస్తున్న బుల్డోజర్ రాజకీయాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రస్దాయిలో విరుచుకుపడింది. డబ్బు దండుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని నాలుగు ఆలయాలకు కూల్చివేత నోటీసులు జారీ చేసిందని ఆరోపించింది. డబ్బు దండుకునేందుకే ఢిల్లీ శ్రీనివాస్పురి ప్రాంతంలోని నీలకంఠ మహదేవ్ ఆలయానికి బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తామని ఉత్తర్వులు జారీ చేసిందని ఆప్ ఎమ్మెల్యే ఆతిషి మర్లెనా గతవారం సైతం ఆరోపణలు గుప్పించారు.
కూల్చివేతల పేరిట కాషాయ నేతలు దోపిడీకి తెరలేపారని ఆమె దుయ్యబట్టారు. ఇదే తరహాలో సరోజినీ నగర్ ప్రాంతంలోని నాలుగు ఆలయాలకూ ఇప్పుడు నోటీసులు జారీ చేశారని ఆప్ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతలకు సంబంధించి గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని ఆమె విలేకరులకు అందచేశారు.
ఈ నోటీసులను ఆలయాల గేట్లకు అతికిస్తున్నారని తెలిపారు. సరోజినీ నగర్లో చారిత్రక శివాలయం వద్ద ఈ నోటీస్ను అతికించారని ఆమె తెలిపారు. హెచ్ బ్లాక్ ప్రాంతంలోని సాయి ఆలయంతో పాటు జే బ్లాక్ ప్రాంతంలోని శని ఆలయానికి కూడా ఈ ఉత్తర్వులు జారీ చేశారని ఆప్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.