న్యూఢిల్లీ : ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP )కి కాంగ్రెస్ మద్దతు తెలపడంతో ఆప్ కీలక ప్రకటన చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని, ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటుతో బీజేపీని ఐక్యంగా ఎదుర్కొంటాయని ఆప్ గుజరాత్ యూనిట్ చీఫ్ ఇసుదన్ గాధ్వి తెలిపారు. విపక్ష కూటమి ఇండియాలో భాగస్వామ్య పక్షాలైన ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటు ఫార్ములాతో పోటీ చేస్తాయని చెప్పారు.
ఈ దిశగా ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య చర్చలు ప్రాధమిక దశలో ఉన్నాయని అన్నారు. తాము అనుకున్నట్టు జరిగితే ఈసారి గుజరాత్లో బీజేపీ మొత్తం 26 స్ధానాలను గెలుచుకునే పరిస్ధితి ఉండదని తాను కచ్చితంగా చెప్పగలనని స్పష్టం చేశారు. గుజరాత్లో తమ పార్టీ తరపున ఏయే స్ధానాల్లో అభ్యర్ధులను బరిలో దింపాలనే కసరత్తు ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.
ఆప్ చీఫ్ వ్యాఖ్యలపై గుజరాత్ కాంగ్రెస్ నేత రియాక్టయ్యారు. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ దోషీ స్పష్టం చేశారు. ఆప్ నేత ప్రకటన తాను ఇప్పుడే విన్నానని, ఎన్నికల పొత్తులను పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని అన్నారు. ఎన్నికల పొత్తులపై పార్టీ జాతీయ నేతల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని దోషీ చెప్పారు.
Read More :
Rahul Gandhi | పార్లమెంట్లో అడుగుపెట్టనున్న రాహుల్.. స్వీట్లను పంచి పెట్టిన మల్లికార్జున ఖర్గే