న్యూఢిల్లీ : విపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆప్ ఎమ్మెల్యే సౌరవ్ భరధ్వాజ్ ఆరోపించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై లిక్కర్ స్కాం కేసును ప్రస్తావిస్తూ కాషాయ పార్టీ తీరును ఆయన తప్పుపట్టారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన మనీష్ సిసోడియాను బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోందని ప్రశ్నించారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలు వెంటాడుతున్నా ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపకూడదని బీజేపీ కోరుకుంటోందని అన్నారు. అవినీతి ఆరోపణలున్న నేతలు బీజేపీలో చేరగానే వారిపై నమోదైన కేసులు తొలగిస్తున్నారని అన్నారు.
బెంగాల్లో సువేందు అధికారి టీఎంసీలో ఉండగా ఆయనపై ఎన్నో కేసులున్నాయని, ఆయన బీజేపీలోకి రాగానే కేసులన్నీ మూసేశారని అన్నారు. ఇప్పుడు ఆయన బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారని గుర్తుచేశారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ముకుల్ రాయ్, నారాయణ్ రాణే వంటి నేతలు అవినీతిలో మునిగితేలగా వారు కాషాయ కండువా కప్పుకోగానే నిజాయితీపరులుగా మారారని ఆప్ ఎమ్మెల్యే సౌరవ్ భరధ్వాజ్ విస్మయం వ్యక్తం చేశారు.