న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే ఎన్నికల ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఇవాళ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఫస్ట్ లిస్టులో 11 మంది ఉన్నారు. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆప్‌లో చేరిన ఆరుగురికి తొలి జాబితాలో చోటు కల్పించారు. పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తొలి జాబితాను రిలీజ్ చేశారు. బ్రహ్మ సింగ్ తన్వార్, అనిల్ జా, బీబీ త్యాగిలు బీజేపీ నుంచి ఆప్‌లో చేరారు. జుబైర్ చౌదరీ, వీర్ సింగ్ దింగన్, సోమేశ్ షోకీన్‌లు కాంగ్రెస్ నుంచి ఆప్‌లోకి వచ్చారు. కేజ్రీ ప్రకటించిన జాబితాలో సరితా సింగ్, రామ్ సింగ్ నేతాజీ, గౌరవ్ శర్మ, మనోజ్ త్యాగీ, దీపక్ సింఘాల్ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకున్నది.