న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను, ఆయన సహచరులు కొందరిని ఈడీ సోమవారం అరెస్ట్ చేసింది. ఉదయం 6 గంటలకే ఎమ్మెల్యే నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు అనంతరం ఆయనను అదపులోకి తీసుకున్నారు. తాము అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎమ్మెల్యే అస్పష్ట సమాధానాలు ఇవ్వడంతో అరెస్ట్ చేశామని ఈడీ పేర్కొంది. అమానతుల్లా ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పుడు (2018-2022) చట్టవిరుద్ధంగా సిబ్బందిని నియమించారని, బోర్టు ఆస్తులను పారదర్శకత లేకుండా లీజుకు ఇచ్చారని ఈడీ ఆరోపించింది.
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, కేసులో సాక్షులందర్నీ విచారించే వరకు ఢిల్లీ సీఎం నివాసంలోకి ప్రవేశించరాదని బిభవ్‌పై నిషేధం విధించింది. ఢిల్లీ సీఎం కార్యాలయంలో ఎలాంటి బాధ్యతలు తీసుకోరాదని, కేజ్రీవాల్ సహాయకుడిగా తిరిగి విధుల్లో చేరకూడదని ఆదేశించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశంలో 23వ న్యాయ సంఘాన్ని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 22వ న్యాయ సంఘం పదవీకాలం ఆగస్టు 31తో ముగిసిన నేపథ్యంలో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసింది. 23వ న్యాయ సంఘానికి పూర్తికాల చైర్మన్‌తో పాటు నలుగురు పూర్తికాల సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉండనున్నారు. న్యాయ వ్యవహారాల విభాగం కార్యదర్శి, శాసన విభాగం కార్యదర్శి ఎక్స్ అఫీషియో సభ్యులు గా ఉంటారు. న్యాయ సంఘంలో ఐదుగురికి మించకుండా పార్ట్‌టైమ్ సభ్యులు ఉంటారు.