న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, మాజీ సీఎం అతిషి (Atishi) ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఒక మహిళ ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఆదివారం ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. 22 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకురాలిగా అతిషి పేరును ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రతిపాదించారు. ఢిల్లీ సీఎం రేఖ గుప్తాను ఎదుర్కోవడానికి బలమైన మహిళా నేతగా అతిషిని పేర్కొన్నారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా తనను ఎన్నుకోవడం పట్ల అతిషి హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పార్టీ ఎమ్మెల్యేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ‘బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతును లేవనెత్తుతుంది. బీజేపీ ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేలా ఆప్ ప్రయత్నిస్తుంది’ అని అన్నారు.
మరోవైపు ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. 48 స్థానాలను గెలుచుకున్న బీజేపీ దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆప్ 22 సీట్లలో విజయం సాధించగా కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.