న్యూఢిల్లీ, జూలై 5: కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిన చందాన మొన్నటి వరకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించే అధికార భవనాన్ని శీష్ మహల్ (అద్దాల మేడ)గా అభివర్ణించి, దాని కోసం ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి విలాసంగా జీవించారని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ లైన్స్‌లో ఉన్న తన అధికారిక బంగ్లాకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రూ.60 లక్షలతో మరిన్ని హంగులు సమకూర్చుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేఖా గుప్తా త్వరలోనే శీష్ మహల్‌కు తన నివాసాన్ని మార్చనున్నారు.
ఈ క్రమంలో ఆ భవనం ఆధునీకరణకు దాని నిర్వహణను పర్యవేక్షించే పీడబ్ల్యూడీ శాఖ రూ.60 లక్షలతో వివిధ ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆధునీకరణ పనులకు టెండర్ పిలిచింది. దాంతో శీష్ మహల్లో 14 ఏసీలు, ఐదు అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ టీవీలు, 4 సీసీ టీవీ కెమెరాలు, ఒక యూపీఎస్, గీజర్లను, వాషింగ్ మెషీన్, గ్యాస్ స్టవ్‌లను అమర్చనున్నారు. కాగా, పేదల పార్టీ అని చెప్పుకునే కేజ్రీవాల్ విలాసవంతమైన భవనంలో నివసించారని, తాము అధికారంలోకి వచ్చాం కాబట్టి దానిని మ్యూజియంగా మారుస్తామని రేఖా గుప్తా తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించారు. కాగా, మొన్నటి వరకు విమర్శలు చేసిన రేఖా గుప్తా ఇప్పుడు దాని పునరుద్ధరణకు రూ.60 లక్షలు ఖర్చు చేస్తుండటాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు రేఖా గుప్తా శీష్ మహల్‌ను మాయా మహల్‌గా మారుస్తున్నారంటూ ఆరోపించింది. మాపై ఆరోపణలుచేసి ఇప్పు డు మీరు చేస్తున్నదేమిటని నిలదీసింది.