న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆప్ ప్రతిపాదిత సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదుపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీ శాసన సభ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకాలను ఆపడానికి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. మహిళా సమ్మాన్ యోజన పేరుతో మహిళల వ్యక్తిగత వివరాలను ప్రైవేట్ వ్యక్తులు సేకరిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దర్యాప్తునకు ఆదేశించడంపై కేజ్రీవాల్ ఈ విధంగా స్పందించారు.