న్యూఢిల్లీ, ఆగస్టు 22 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తున్న బీహార్ ఓటర్లు తమ నివాస రుజువుగా ఆధార్‌ని సమర్పించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. నివాస రుజువు కోసం ఎన్నికల కమిషన్ కోరుతున్న 11 ధ్రువపత్రాలలో ఆధార్‌ని కూడా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లను మినహాయించిన తర్వాత తొలగింపునకు గురైన మిగిలిన దాదాపు 35 లక్షల మంది ఓటర్లు త్వరితంగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.
సెప్టెంబర్ 1 నాటికి పత్రాల దాఖలు పూర్తయ్యేలా చూడాలని ఈసీని కోర్టు ఆదేశించింది. తమ ఓటు హక్కు కోల్పోయిన లక్షలాదిమంది ఓటర్లకు సాయపడడంలో రాజకీయ పార్టీలు ఎందుకు ముందుకురాలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ‘రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయో మాకు ఆశ్చర్యంగా ఉంది. మీ బీఎల్ఏలు ఏం చేస్తున్నారు? ఓటర్లకు రాజకీయ పార్టీలు సాయపడాలి కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.