ఢిల్లీ: ‘మీ కుక్క రోజూ మా ఇంటి ముందు మల విసర్జన చేస్తున్నది’ అంటూ గొడవకు దిగిన పొరుగింటి మహిళపైకి ఓ యువకుడు తన పెంపుడు కుక్కను వదిలి దాడి చేయించాడు. అంతటితో ఆగక ఆ యువకుడు కూడా సదరు మహిళపై దాడి చేశాడు. ఒక వైపు కుక్క ఆ మహిళపై ఎగబడుతుండగానే ఆ యువకుడు కూడా ఆమెను నేలపై పడేలా బలంగా నెట్టేశాడు. ఢిల్లీలోని స్వరూప్ నగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్వరూప్ నగర్‌కు చెందిన రియా దేవి అనే మహిళ ఇంటి ముందు ఆమె పొరుగింటి వాళ్లు పెంచుకునే కుక్క రోజూ మల విసర్జన చేస్తున్నది. అలా జరగకుండా చూసుకోవాలని సదరు మహిళ ఎన్నిసార్లు చెప్పినా కుక్క యజమాని కుంటుంబం పట్టించుకోవడం లేదు. దాంతో శుక్రవారం ఆ మహిళకు కుక్క యజమాని ఇంటి ముందు గొడవకు దిగింది. ఆగ్రహించిన కుక్క ఓనర్ దాన్ని ఆమె పైకి ఉసిగొల్పాడు.
ఒక వైపు పెంపుడు కుక్క ఆమెపై ఎగబడుతుండగానే ఆ కుక్క యజమాని కూడా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. వచ్చీరావడంతోనే ఆమెను బలంగా నెట్టేయడంతో కింద పడిపోయింది. ఈ ఘటనలో మహిళకు ఒళ్లంతా గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు, ముఖంపై కుక్క పంటి గాళ్లు పడ్డాయి. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా బెయిల్‌పై బయటికి వచ్చాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసుల తెలిపారు.