న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణ కోసం భార్య తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసినప్పటికీ, ఆమె భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ పరిస్థితిని పిల్లల పెంపకం కోసం అత్యున్నత కర్తవ్య నిర్వహణ బాధ్యతకు పర్యవసానంగా చూడాలని తెలిపింది. ఆమె బుద్ధిపూర్వకంగా ఉద్యోగాన్ని వదులుకున్నట్లు పరిగణించకూడదని స్పష్టం చేసింది. జస్టిస్ స్వరణ కాంత శర్మ ఈ నెల 13న ఈ తీర్పు చెప్పారు. భార్యకు, మైనర్ కుమారునికి తాత్కాలిక పోషణ భత్యాన్ని మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి తిరస్కరించారు.
ట్రయల్ కోర్టు 2023 అక్టోబరులో ఇచ్చిన తీర్పులో, భార్యకు, కుమారునికి నెలకు చెరొక రూ.7,500 చెల్లించాలని ఆదేశించింది. భార్యకు నెలకు రూ.7,500 చొప్పున, కుమారునికి నెలకు రూ.4,500 చొప్పున తాత్కాలిక పోషణ భత్యాన్ని చెల్లించాలని చెప్పింది. మైనర్ బాలుని పోషణ బాధ్యత అతనిని స్వాధీనంలో ఉంచుకున్న భార్య లేదా భర్తపైనే ఉంటుందని తెలిపింది. అటువంటి భార్య లేదా భర్త పూర్తి కాలం ఉద్యోగం చేయగలిగే సామర్థ్యం పరిమితమవుతుందని పేర్కొంది. తల్లి ఉద్యోగం కోసం వెళ్లినపుడు, బాలుని సంరక్షణ బాధ్యతను చూసుకోవడానికి కుటుంబం సహకారం లేనపుడు, ఆమె ఉద్యోగం చేసే సామర్థ్యం తగ్గిపోతుందని వివరించింది.