POK | శ్రీనగర్/న్యూఢిల్లీ, మే 12: ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరతపై పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో జమ్ముకశ్మీర్ సంయుక్త ఆవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పీవోకే మొత్తం హింసతో దద్దరిల్లిపోతున్నది. పీవోకేపై పెత్తనం చేస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల వివక్షాపూరిత వైఖరికి నిరసిస్తూ తిరుగుబాటు ఉద్యమం చేస్తున్నారు. ఆందోళనకారులు పాకిస్థాన్ నుంచి ‘ఆజాదీ(స్వాతంత్య్రం)’ కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల పీవోకేను భారత్‌లో కలుపాలని కోరుతూ పోస్టర్లు వెలవడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. పీవోకేలో తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ సోమవారం అధ్యక్ష నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
భద్రతా దళాలు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, 100 మందికి గాయాలయ్యాయని మీడియా నివేదికలు ఆదివారం వెల్లడించాయి. ముజఫరాబాద్, రావాలకోట్ ఇతర చోట్ల పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణ పడిన ఘటనలు చోటుచేసుకొన్నాయి. దడ్యాల్లో ఆందోళనకారులపైకి పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. పీవోకేలోని భింబేర్, బాగ్, మీర్పూర్ సహా పలు ప్రాంతాల్లో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను ఆదివారం నిలిపివేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని పాటించకపోవడంపై అవామీ యాక్షన్ కమిటీ ఇటీవల ఆందోళనలకు పిలుపునిచ్చింది. విద్యుత్తు బిల్లులపై అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన అవామీ కమిటీ.. గత ఏడాది ఆగస్టులో కూడా బంద్ చేపట్టింది. పీవోకేలోని ప్రతి ఒక్కరూ బయటకు రావాలని, తమ హక్కుల కోసం గొంతెత్తాలని అవామీ యాక్షన్ కమిటీ సభ్యుడు సౌకత్ నవాజ్ మీర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా గోధుమ పిండిని రాయితీపై పంపిణీ చేయాలన్నారు.