గువాహటి, మే 30: జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై జాతీయ అవార్డు గ్రహీత, సినీ నిర్మాత ల్యూట్ కుమార్ బర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్ముడిని అవమానపరిచేలా మోదీ వ్యాఖ్యలు చేసినందున ఆయనపై కేసు నమోదు చేయాలంటూ గువాహటిలోని హటిగావ్ పోలీస్స్టేషన్లో బుధవారం ఫిర్యాదు అందజేశారు.
అయితే దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మహాత్ముడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తని, అయితే ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన గాంధీ చిత్రం విడుదలయ్యే వరకు ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదంటూ మోదీ ఒక టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారని చెప్పారు.