న్యూఢిల్లీ, డిసెంబర్ 13: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తక్కువ వేతనాలు ఇవ్వడంపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పథకం కింద ఇస్తున్న వేతనాలను ద్రవ్యోల్బణం సూచికను దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. వేతనాలను పెంచేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను కోరింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్పై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్ సమర్పించిన నివేదికను కేంద్రం గురువారం లోక్సభ ముందు ఉంచింది. ఉపాధి హామీ పథకంలో వేతనాల సవరణకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిసారి ఒకే విధమైన సమాధానం ఇస్తోందని ప్యానెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘పల్లెలు, పట్ణణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ధరలు, జీవన వ్యయం పెరగడం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఇలాంటి సమయంలోనూ చాలా రాష్ర్టాల్లో ఉపాధి హామీ పథకంలో ఇచ్చే రోజువారీ కూలీ రూ.200 అటు ఇటుగా ఉంది. ఆయా రాష్ర్టాల్లో ఇతర కూలీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ తర్కాన్ని అవి ఎలా ధిక్కరిస్తాయి?’ అని ప్యానెల్ ప్రశ్నించింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉపాధి హామీ వేతనాలను సవరించాలని సూచించింది. ఈ పథకంలో అందిస్తున్న వేతనాలు వివిధ రాష్ర్టాల్లో వివిధ రకాలుగా ఉండటం మరొక ఆందోళనకర అంశమని తెలిపింది. రాజ్యాంగంలోని 39వ అధికరణ ప్రకారం ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమాన వేతనం చెల్లించాలని పేర్కొంది. ఈ పథకంలో కనీస పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని ప్యానెల్ ప్రతిపాదించింది.