Online Games | ఆన్లైన్ గేమ్స్ అలవాటు ఓ బాలుడు నిండు ప్రాణం బలి తీసుకుంది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన బాలుడు.. తన మేనమామను తరచూ డబ్బుల కోసం వేధించాడు. దీంతో విసిగిపోయిన అతను బాలుడిని దారుణంగా హత్య చేశాడు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమోఘకీర్తి (14) అనే బాలుడు గత ఎనిమిది నెలలుగా బెంగళూరులోని సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక లేఅవుట్లో ఉన్న తన మేనమామ నాగప్రసాద్ (50)తో కలిసి ఉంటున్నాడు. అమోఘకీర్తి కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌కు బానిసగా మారాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు తరచూ డబ్బులు కావాలని మేనమామను అడిగేవాడు. డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవాడు. అమోఘ కీర్తి తరచూ డబ్బులతో విసిగిపోయిన మేనమామ.. సోమవారం ఉదయం 4.30 గొంతుకోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటి నుంచి పరారైన నాగప్రసాద్ మూడు రోజుల తర్వాత, గురువారం రాత్రి సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నాగప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అతని ఇంటికి వెళ్లిన పోలీసులు.. కుళ్లిన స్థితిలో ఉన్న అమోఘకీర్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డబ్బుల కోసం తరచూ అమోఘకీర్తి వేధించేవాడని.. ఈ క్రమంలో తమ మధ్య వారం క్రితం పెద్ద గొడవ జరిగిందని పోలీసుల విచారణలో నాగప్రసాద్ తెలిపాడు. వారం క్రితం జరిగిన గొడవలో తన మేనల్లుడు తనను కొట్టాడని.. అది తట్టుకోలేకనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ హత్య అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని.. కానీ ప్రయాణానికి డబ్బులు లేకపోవడంతో తన ఆలోచనను విరమించుకున్నానని పోలీసులను నాగప్రసాద్ తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమోఘ కీర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.