జైపూర్, ఆగస్టు 13: రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. తన బైక్కు భార్యను కట్టేసి.. ఊరంతా చూస్తుండగా ఈడ్చుకుంటూ వెళ్లాడు. తన సోదరి ఇంటికి వెళ్తానన్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నహర్సింఘాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడు ప్రేమారమ్ మేఘ్వాల్(32)ను అరెస్టు చేశామని పాంచౌదీ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ సురేంద్ర కుమార్ తెలిపారు. ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ప్రస్తుతం తన బంధువుల వద్ద ఉం దని, ఆమె నుంచి ఫిర్యాదు అందలేదని అన్నారు. మద్యానికి బానిసైన మేఘ్వాల్ తరుచూ భార్యను కొట్టేవాడని స్థానికులు చెప్పారు.