Encounter | శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నది. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఓ పోలీస్ అధికారి వీరమరణం పొందారు. కర్నల్ మన్‌ప్రీత్ సింగ్, 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారి మేజర్ ఆశిష్ దోనక్, డిఎస్పీ హుమయూన్ భట్ మృతిచెందారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడికి బాధ్యత వహించింది. అనంతనాగ్ జిల్లాలోని కోకోరెనాగ్ కొండ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం ఆర్మీ గాలింపు చేపట్టింది. బుధవారం ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై దాడులకు తెగబడ్డారు. దీంతో కర్నల్ మన్‌ప్రీత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ బలగాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మేజర్ ఆశిష్, డీఎస్పీ భట్ కూడా గాయాలపాలయ్యారు. దీంతో వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు అధికారులు ప్రాణాలు విడిచారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఘటన ప్రాంతాన్ని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయి, డీజీపీ దిల్బాగ్ సింగ్ సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా, ఆగస్టు 4న ముగ్గురు జవాన్ల మృతికి కారణమైన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడ్డారని ఆర్మీ భావిస్తున్నది.
విశ్వాసంలో తనకు తానే సాటి అని ఓ ఆర్మీ జాగిలం మరోసారి చాటాచెప్పింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జవాన్ ప్రాణాలను రక్షించిన ఓ జాగిలం అందరి చేత శభాష్ అనిపించుకుంది. కెంట్ అనే ఆరేండ్ల లాబ్రడార్ జాతికి చెందిన ఆడ జాగిలం 21వ ఆర్మీ డాగ్ యూనిట్లో సేవలందిస్తున్నది. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న ఆర్మీ జవాన్లను ఆ జాగిలం ముందుండి నడిపిస్తున్నది. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా… ముందే పసిగట్టిన కెంట్ ప్రాణాలకు తెగించి బుల్లెట్లకు ఎదురు నిలిచి జవాన్‌ను కాపాడింది. కెంట్ సేవలకు గానూ ఆర్మీ అధికారులు జాతీయ జెండాను మృతదేహంపై కప్పి అధికారికంగా అంత్యక్రియలు జరిపించారు.