న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశవ్యాప్తంగా వెబ్సైట్లు, కీలక మౌలిక సదుపాయాలపై దాడి చేయనున్నట్టు అదిపెద్ద హ్యాకర్ గ్రూప్ ఒకటి ప్రకటించడంతో దేశం అప్రమత్తమైంది. అనధికారిక యాక్సెస్‌ను నిలువరించేందుకు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఆరోగ్య రంగం, సైబర్ మౌలిక సదుపాయాలను హ్యాకర్ గ్రూప్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వ ఏజెన్సీలు వాటిని అప్రమత్తం చేశాయి. అనధికారిక యాక్సెస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయాలని సూచించాయి. సైబర్ దాడులకు ప్రసిద్ధి చెందిన పాకిస్థాన్, ఇండోనేషియాలోని హ్యాకర్ గ్రూపులు ‘టెలిగ్రామ్’ చానల్ ద్వారా డిసెంబర్ 11న ‘సైబర్ పార్టీ’ని ప్రకటించాయి. ఈ చానల్లో 4 వేల మందికిపై సభ్యులు ఉన్నారు. ‘సైబర్ పార్టీ’ పేరుతో దాడికి సిద్ధమవుతున్న ఈ గ్రూప్ భారతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను ఛిన్నాభిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.