భోపాల్, జనవరి 17: ‘అందమైన అమ్మాయిని చూసిన వ్యక్తి మనసు వశం తప్పి అది లైంగికదాడికి దారితీయవచ్చు… బీసీ మహిళలు అందంగా లేకపోయినా వారి గ్రంథాలలో అది రాసి ఉన్నందున లైంగికదాడికి గురవుతున్నారు’ అంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోని బాంధర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫూల్సింగ్ బరయ్యా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘భారతదేశంలో లైంగికదాడి బాధితులు ఎవరు? ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఓబీసీలకు చెందిన మహిళలు.
అత్యాచార సిద్ధాంతం ఏమిటంటే ఒక పురుషుడు అతని మానసిక స్థితితో సంబంధం లేకుండా రోడ్డుపై నడుస్తూ అందమైన అమ్మాయిని చూస్తే, అతడు స్థిమితం లేకుండా ఆమెపై లైంగికదాడి చేయగలడు. అలాగే వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు అందంగా లేకపోయినా లైంగికదాడికి గురవుతున్నారంటే అది వారి గ్రంథాలలో రాసి ఉంది’ అని పేర్కొన్నారు. దళిత మత గ్రంథాలలో రాసిన నమ్మకాల ద్వారా ప్రేరేపితమైనవారు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిని వారు ఒక పవిత్రంగా పరిగణిస్తున్నారని తెలిపారు.