బెంగళూరు, జూలై 28: కర్ణాటకలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సీఎం సిద్ధరామయ్యను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో కేసు దాఖలైంది. రాజ్యాంగంలోని నిబంధనలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నియమాలను సిద్ధరామయ్య ఉల్లంఘించారని, ఆయనను వరుణ అసెంబ్లీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ కేఎం శంకర అనే పౌరుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సునీల్‌దత్ దీనిపై తగు వివరణ ఇవ్వాలంటూ సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేశారు.
రోజూ ఏమిటీ నాన్సెన్స్?
సీఎం సిద్ధరామయ్య ఇంటి ముందు గురువారం గందరగోళం నెలకొంది. రోజూ సిద్ధరామయ్య ఇంటికి వచ్చే నేతలు, సందర్శకుల వాహనాలతో తాము నివాసం నుంచి బయటకు వెళ్లడానికి వీలులేకుండా పోతున్నదని ఆయన ఇంటి ఎదురుగా నివసించే సీనియర్ సిటిజన్ నరోత్తమ్ ఆరోపించారు. సీఎం వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి బంగ్లా ఇటీవలే ఖాళీ అయింది. సిద్ధరామయ్య ఆగస్టు నెలలో ఆ బంగ్లాలోకి మారే అవకాశం ఉంది.