అహ్మదాబాద్, నవంబర్ 11: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు మైనార్టీ ఓట్లపై అందరి దృష్టి పడింది. ఈసారి ఎన్నికల బరిలో నాలుగైదు పార్టీలు మైనార్టీ ఓట్లపై దృష్టి పెట్టాయి. 2017 వరకూ రాష్ట్రంలోని మైనార్టీలంతా కాంగ్రెస్‌కే గంపగుత్తగా ఓట్లేసేవారు. అధికార బీజేపీ హిందూత్వ ఎజెండాతో ఎన్నికలకు వెళ్తుండటంతో మైనార్టీలు ఆ పార్టీకి ఎన్నడూ దగ్గర కాలేదు. ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్‌తోపాటు ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్), ఎంఐఎం కూడా మైనార్టీలకు గాలం వేసేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.
25 స్థానాల్లో ప్రభావం
గుజరాత్ జనాభా 6.5 కోట్లు. ఇందులో 11 శాతం మైనార్టీలు ఉన్నారు. వీరు 25 అసెంబ్లీ సీట్లలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారు. అయినా, ఎన్నడూ ఒకరిద్దరికంటే ఎక్కువ మంది మైనార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదు. 2012లో ఇద్దరు, 2017లో ముగ్గురు మాత్రమే గెలిచారు. వారంతా కాంగ్రెస్ అభ్యర్థులే. నిన్నమొన్నటి వరకూ రాష్ట్రంలో మైనార్టీలకు కాంగ్రెస్ తప్ప మరో పార్టీ కనిపించలేదు. కానీ, ఇప్పుడు బలమైన ప్రత్యామ్నాయాలు వారి ముందు కనిపిస్తున్నాయి.
ఓట్ల చీలిక భయం
గుజరాత్లో మైనార్టీలు.. ముఖ్యంగా ముస్లింలు అధికార బీజేపీకి ఓటు వేయరు. గతంలో అనేకసార్లు ఇది నిరూపితమైంది. వారంతా కాంగ్రెస్ వెంటే ఉండేవారు. ఓట్లు చీలేవికాదు. కానీ, ఈసారి ఆ పరిస్థితి కనిపించటంలేదు. కాంగ్రెస్‌తోపాటు ఆప్, ఎంఐఎం కూడా ముస్లిం ఓట్లకోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. వీటితోపాటు మరికొన్ని చిన్నపార్టీలు కూడా బరిలో ఉన్నాయి. దీంతో మైనార్టీల ఓట్లు చీలిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఇది అంతిమంగా అధికార బీజేపీకే లాభం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పాటీదార్లకు ఆప్ గాలం
గుజరాత్లో అత్యంత శక్తిమంతమైన సామాజిక వర్గం పాటిదార్ల (పటేండ్లు)ను తమవైపు తిప్పుకొనేందుకు ఆప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సంఖ్యపరంగా తక్కువే అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో వీరు చెప్పిందే వేదం. గుజరాత్ ప్రస్తుత సీఎం కూడా పాటిదారే. ఈ కమ్యూనిటీని తమవైపు తిప్పుకొనేందుకు పాటిదార్ ఉద్యమ నాయకుడు కతిరియాను ఆప్ వరచ్చ రోడ్ స్థానంలో అభ్యర్థిగా నిలబెట్టింది. పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన శక్తిమంతమైన యువ నాయకుల్లో హార్దిక్‌పటేల్ తర్వాత కతిరియానే ఉన్నారు. హార్దిక్ పటేల్ బీజేపీలో చేరగా, కతిరియానే పాస్‌కు నాయకత్వం వహిస్తున్నారు. పాటిదార్లు బబ్బర్‌షేర్ అని ముద్దుగా పిలుచుకొనే కతిరియా ఆప్ తరఫున భారీ ప్రచారం చేస్తున్నాడు. పాటిదార్లను బీజేపీ మోసం చేసిందని, ఆ పార్టీకి ఈసారి తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నాడు.