Crime news : సోషల్ మీడియా (Social media) లో పరిచయమైన స్నేహితుడి మాయమాటలు నమ్మి బ్రిటన్ (Britain) కు చెందిన ఓ యువతి అతడిని కలిసేందుకు భారత్ (India) కు వచ్చింది. కానీ స్నేహితుడి చేతిలోనే ఆమె మోసపోయింది. ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లిన స్నేహితుడు అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని మహిపాల్పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న కైలాశ్‌కు బ్రిటన్‌కు చెందిన మహిళతో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అతడిని చూసేందుకు ఇటీవల ఆమె భారత్‌కు వచ్చింది. మహిపాల్‌పూర్‌లోని ఒక హోటల్ గదిని బుక్ చేసుకుంది. ఆమెను కలిసేందుకు వచ్చిన కైలాశ్.. మహిళతో అభ్యంతరకరంగా వ్యవహరించాడు. మరో స్నేహితుడితో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తొలుత కైలాశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అక్కడి నుంచి తప్పించుకొని రిసెప్షన్ వద్దకు చేరుకునేందుకు లిఫ్ట్ ఎక్కిన తనను అతడి స్నేహితుడు లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. భారత్‌కు వచ్చిన ఆ మహిళ తొలుత మహారాష్ట్ర, గోవాల్లో పర్యటించింది.
కైలాశ్ని కూడా అక్కడికి రమ్మని అడిగింది. అయితే తాను రాలేనని చెప్పి ఆమెనే ఢిల్లీకి రావాలని కోరాడు. ఆమెతో ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ఇబ్బందిపడిన కైలాశ్.. గూగుల్ ట్రాన్స్‌లేట్ వాడినట్లు బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘటనను భారత్‌లోని బ్రిటన్ హైకమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కర్ణాటకలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.
కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో కొందరు నిందితులు విదేశీ పర్యాటకులపై దాడి చేసి, ముగ్గురిని కాల్వలోకి తోసి, ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. నదిలో పడిన వారిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అత్యాచారానికి గురైన వారిలో ఇజ్రాయెల్‌కు చెందిన మహిళ ఉందని పోలీసులు తెలిపారు.