Breast Cancer | హైదరాబాద్, మే 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మహిళలకు పెనుశాపంగా మారిన రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది. రొమ్ము నుంచి సేకరించిన కణజాలాన్ని శరీరానికి అవతల ఏకంగా వారంపాటు భద్రపరిచే కొత్త జెల్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ పరిశోధకులు వెల్లడించారు. రొమ్ము క్యాన్సర్ పరిశోధనలకు, క్యాన్సర్ చికిత్సకు ఈ సాంకేతికత ఓ గేమ్‌ఛేంజర్ అని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు.
సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌కు గురైన మహిళలకు చికిత్సలో భాగంగా కొన్ని మందులను ఇస్తారు. అయితే, జన్యుక్రమాన్ని బట్టి ఈ మందులు కొందరికి పనిచేయవచ్చు. మరికొందరికి పనిచేయకపోవచ్చు. దీంతో వేరే డ్రగ్స్ వాడటానికి సమయం మించిపోవడంతో బాధితులు మరణించేవారు. అయితే, తాజా జెల్ సొల్యూషన్‌లో క్యాన్సర్‌కు గురైన మహిళ రొమ్ము కణజాలాన్ని వారంపాటు భద్రపర్చవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ సమయంలో క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా ఏ డ్రగ్ సమర్థంగా పనిచేస్తుందో జెల్లో ఉంచిన కణజాలానికి ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఆ మందులు సమర్థంగా పనిచేస్తే.. వాటినే బాధితులకు ఇచ్చినైట్లెతే, క్యాన్సర్‌ను నయంచేయడంతో పాటు మరణాలను కూడా తగ్గించవచ్చని తెలిపారు. ఈ వివరాలు ‘నియోప్లాసియా’, ‘మామరీ గ్లాండ్ బయాలజీ’ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న క్యాన్సర్ మహమ్మారిలో రొమ్ము క్యాన్సరే ప్రధానమైంది. ప్రపంచంలోని 157 దేశాల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఒక్కఏడాదే ఈ క్యాన్సర్‌తో 6,70,000 మంది మరణించారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.