ముంబై, జనవరి 1: ఈ నెల 15న జరుగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తమదేనని నమ్ముతున్న మహాయుతి కూటమి దీని ప్రభావంతో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నది. గడచిన మూడేండ్లకుపైగా అభివృద్ధి పనుల కోసం బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)కి కేటాయించిన నిధుల్లో 99 శాతం మహాయుతి కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే దక్కినట్లు సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద లభించిన రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2023 ఫిబ్రవరి నుంచి 2025 అక్టోబర్ వరకు రోడ్ల మరమ్మతు, డ్రైనేజీల అభివృద్ధి, ఆరోగ్య సదుపాయాలు, నగర సుందరీకరణ తదితర నగర అభివృద్ధి పనుల కోసం బీఎంసీ రూ.1,490.66 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. 1,476.92 కోట్లు బీజేపీ, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో కూడిన అధికార మహాయుతి కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీల పరిధిలోని ప్రాంతాలకే దక్కినట్లు రికార్డులు చూపుతున్నాయి.
బీజేపీ ప్రజాప్రతినిధులకు సింహభాగం(రూ. 1,076.7 కోట్లు) దక్కగా తర్వాతి స్థానంలో షిండేకు చెందిన శివసేన ప్రజాప్రతినిధులు(రూ.327.7 కోట్లు) ఉన్నారు. ఇందుకు పూర్తి భిన్నంగా విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులకు కేవలం రూ.13.74 కోట్లు లేదా 0.9 శాతం నిధులు మాత్రమే దక్కాయి. అది కూడా మైనారిటీ జనాభా అధికంగా దక్షిణ ముంబైలోని ముంబాదేవి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్‌కు మాత్రమే ఈ నిధులు లభించాయి. మిగిలిన శివసేన(యూబీటీ)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన మరో ఇద్దరు, సమాజ్‌వాదిపార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే నియోజక వర్గాలకు బీఎంసీ ఒక్కపైసా విదల్చకపోవడం గమనార్హం. దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్‌గా పేరుపొందిన బీఎంసీ వార్షిక బడ్జెట్ రూ. 74,000 కోట్ల మేరకు ఉండగా నిష్పాక్షిక పాలన కొరవడడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. నగరవ్యాప్తంగా జరగాల్సిన అభివృద్ధి కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నియోజకవర్గాలకే పరిమితం కావడం ప్రజాధనం దుర్వినియోగాన్ని ప్రతిబింబిస్తున్నది. విపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు అభివృద్ధికి దూరం కావడం, నిధులన్నీ పాలక పక్షానికే దక్కడం పాలకుల పక్షపాత వైఖరిని బట్టబయలు చేస్తున్నది. 2023 ఫిబ్రవరి నుంచి 2024 నవంబర్ మధ్య మహాయుతికి ముంబైలో 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమికి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
2024 నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత విపక్ష కూటమి నుంచి మరో స్థానాన్ని కైవసం చేసుకున్న మహాయుతి తన బలాన్ని 22కి పెంచుకోగా ఆరుగురు ఎంపీలలో నలుగురు ఎంవీఏకి చెందిన వారు ఉండడం విశేషం. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 360 కోట్ల నిధులను బీఎంసీ విడుదల చేయగా మొత్తం నిధులన్నీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే దక్కాయి. కాగా, 2022 మార్చిలో బీఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిపోవడంతో బీఎంసీ కౌన్సిల్ రద్దయింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో పాలనాధికారిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిపాదించే పనులకు నిధులు మంజూరు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. పురపాలన స్తంభించిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని 227 వార్డులతో కూడిన బీఎంసీలో తీసుకురాగా నిధులన్నీ అధికార పార్టీకే దక్కడం ఇందులోని నిజాయితీని ప్రశ్నించేలా చేస్తున్నది.
ఆర్టీఐ ద్వారా వెలుగుచూసిన బీఎంసీ నిధుల కుంభకోణంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గుట్టుగా దాచిన రహస్యాలు బట్టబయలయ్యాయని, మూడేండ్లుగా విడుదల చేసిన నిధుల్లో 99 శాతం అధికార కూటమి పరిధిలోని వార్డుల కోసం వెచ్చించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీఎంసీ ఎన్నికల ముందు సమన్యాయం ఎక్కడ ఉందని ఆయన నిలదీశారు.