Grok Talk | న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 : చెప్పే మాటలకూ చేసే చేతలకూ సంబంధం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుమా ర్లు నిరూపించుకొన్నది. ఉద్యోగాలిస్తామ న్న హామీలకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలు చేపట్టింది. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని గాలికొదిలేసి.. ఉన్న కంపెనీలకు తాళాలు పడే పరిస్థితిని తీసుకువచ్చింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు లేదు. ప్రభుత్వరంగ సంస్థల్ని (పీఎస్‌యూ) అగ్గువ సగ్గువకు అమ్మకానికి పెట్టింది. ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటనలకే పరిమితం చేసింది. మోదీ పదకొండేండ్లపాలనలో దేశంలో పారిశ్రామికరంగం అతలాకుతలమైంది. ‘మేకిన్ ఇండియా’ నినాదం, కంపెనీలు, పీఎస్‌యూలు, ఉద్యోగాలకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ సంచలనమైన వివరాలను వెల్లడించింది. బీజేపీ ప్రభుత్వ డొల్ల విధానాలను గణాంకాలతో సహా బయటపెట్టింది.
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘మేకిన్ ఇండియా’ నినాదం కాస్తా ‘జోకిన్ ఇండియా’గా మారింది. ఎప్పటి నుంచో దేశానికే వన్నె తెచ్చిన పరిశ్రమలెన్నో నేడు అవసానదశకు చేరుకున్నాయి. ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ లక్ష్యాలను చేరుకొన్నదా? అనే ప్రశ్న ను అడగ్గా.. లేదంటూ గణాంకాలతో సహా ‘గ్రోక్’ వివరించింది. 2022నాటికి జీడీపీలో తయారీరంగం వాటాను 25శాతానికి పెం చాలని మేకిన్ ఇండియాలో లక్ష్యంగా పెట్టుకోగా, 15.9 శాతానికే పరిమితమైనట్టు వివరించింది. 2022నాటికి తయారీ రంగంలో 10 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామంటూ ‘మేకిన్ ఇండియా’ లక్ష్యంగా నిర్ణయించగా.. ఆరేండ్లలో తయారీ రంగంలో 1.57 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు ‘గ్రోక్’ కుండబద్దలు కొట్టింది. సీఎంఐఈ, పీఎల్ఎఫ్ఎస్ డాటా ప్రకారం.. బీజేపీహయాంలో 5 కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకొన్నట్టు వివరించింది. ఎఫ్‌డీఐ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయాల్లోనూ ‘మేకిన్ ఇండియా’ లక్ష్యాలను బీజేపీ ప్రభుత్వం చేరుకోలేదన్న గ్రోక్.. ఒక విధంగా ఇదో వైఫల్య స్కీమ్‌గా అభివర్ణించింది.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోని మోదీ.. కనీసం ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు మూత పడకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్రంలో 2014 నుంచి 2024 మార్చి 31 నాటికి 9,31,644 రిజిస్టర్డ్ కంపెనీలు మూతపడినట్టు ‘గ్రోక్’ వెల్లడించింది. ఫలితంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు బజారునపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. డాటాఫుల్ నివేదికను అనుసరించి గ్రోక్ చెప్పిన వివరాల ప్రకారం.. మూతపడిన రిజిస్టర్డ్ కంపెనీలలో అత్యధికం సేవలరంగానివే. సర్వీస్ సెక్టార్లో 28%, తయారీ రంగంలో 24%, ట్రేడింగ్‌లో 11%, నిర్మాణరంగంలో 10 కంపెనీలు మూతపడ్డాయి. ఇతర రంగాల్లో మరో 27% వరకు ఉన్నాయి. ఇక, కరోనా కాలంలో లాక్డౌన్ కారణంగా కంపెనీలు మూతపడటంతో తీవ్రంగా నష్టపోయిన కంపెనీల ఉద్దీపనకు రూ.16 లక్షల కోట్ల ఆర్థిక సాయం అందించడానికి నిధి ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించినప్పటికీ అమలుకు నోచుకోలేదు.
‘ప్రభుత్వరంగ సంస్థలను నడపించాల్సిన అవసరం, అవశ్యకత ఎంత మాత్రమూ లేదు. అది అసంభవం కూడా’ పీఎస్‌యూల అంశంపై 2021 జూన్‌లో డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్స్ మేనేజ్మెంట్ నిర్వహించిన వెబ్‌నార్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలివి. తన వ్యాఖ్యలకు అనుగుణంగానే ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ)తెగనమ్మడం, సంస్థల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడంలో మోదీ ప్రభుత్వం కొత్త రికార్డులను సృష్టించింది. 2014 నుంచి 2024 మధ్యలో మొత్తం 179 పీఎస్‌యూలను విక్రయించడం లేదా పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా కేంద్రం రూ. 4.48 లక్షల కోట్లను అర్జించినట్టు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘గ్రోక్’ సమాధానమిచ్చింది. 1991 నుంచి ఇప్పటివరకూ జరిగిన పీఎస్‌యూల విక్రయాల్లో 72 శాతం మోదీ హయాంలోనే జరిగినట్టు గ్రోక్ తేల్చి చెప్పింది. ఎయిరిండియా, బీపీసీఎల్, ఎస్సీఐ, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ తదితర పీఎస్‌యూలను మొత్తంగా లేదా కొంత మేర వాటాను బీజేపీ ప్రభు త్వం అమ్మకానికి పెట్టినట్టు వివరించింది.