న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దేశంలోని న్యాయస్థానాలలో పెండింగ్ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. సుప్రీంకోర్టులో 90,897 కేసులు పెండింగ్లో ఉండగా హైకోర్టుల్లో 63,63,406 కేసులు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 4, 84,57, 343 కేసులు పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. తెగని లిటిగేషన్లు, కక్షిదారుల అనాసక్తి, నిందితుల పరారీ, వివిధ కోర్టుల నుంచి స్టే మంజూరు, దస్తావేజుల కోసం నిరీక్షణ, సాక్షులు గైర్హాజరు తదితర అనేక కారణాలు పెండింగ్ కేసులు పెరిగిపోవడానికి కారణాలని మంత్రి వివరించారు. పెండింగ్ కేసులపై శీఘ్రంగా విచారణ జరిపేందుకు చేపట్టిన చర్యలపై అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రూ. 7,210 కోట్ల అంచనా వ్యయంతో ఈ-కోర్టు ప్రాజెక్టు మూడవ దశను ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అమలుచేస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం 2023-24లో రూ. 768.25 కోట్లు, 2024-25లో రూ.1,029.11 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 907.97 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.