న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రయత్నం ఫలించింది. దిగువ కోర్టుల్లో రూ.9 వేల కోట్లతో వసతులు కల్పించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో గజానంద్ బ్లాక్ ప్రారంభం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.9వేల కోట్లతో దిగువ కోర్టుల్లో భవనాలు, డిజిటల్ రూమ్లు, టాయిలెట్లు నిర్మిస్తామన్నారు. మూడు, నాలుగేండ్లలోనే ఈ డబ్బు ఖర్చు చేస్తామని చెప్పారు. జస్టిస్ రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోర్టుల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటును కూడా ఆయన ప్రతిపాదించారు.