Himachal Pradesh | హిల్స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరదలు (Floods) సంభవించాయి. ఈ వరదలకు ఇళ్లు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కాగా, పది రోజుల క్రితం పంగ్లూడ్ గ్రామం (Panglued village)లో వరదల కారణంగా రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది గల్లంతయ్యారు. వారిలో నలుగురి మృతదేహాలను 150 కిలోమీటర్ల దూరంలోని జ్వాలాపూర్ (Jwalapur)లో అధికారులు గుర్తించారు. మరో ఐదుగురి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి జులై 6 నాటికి దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్ బరస్ట్లు (cloud burst), 16 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి (landslides). ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 91కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. 34 మంది గల్లంతయ్యారు. మరో 130 మంది గాయపడ్డారు. మరోవైపు జులై 16వ తేదీ వరకూ హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రా, సిర్మౌర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు జూలై 11 నుంచి 16 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read..
CM Siddaramaiah | నాకు హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉంది.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య
Tesla | జులై 15న భారత్లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..!