భోపాల్: ఆలయం పక్కనున్న గోడ కూలడంతో 9 మంది పిల్లలు మరణించారు. (Children Killed) మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షాపూర్‌లోని హర్దౌల్ బాబా దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు శివలింగాలు తయారు చేస్తుండగా ఆలయం పక్కనే ఉన్న పురాతన ఇంటి గోడ కూలింది.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. జేసీబీతో గోడ శిథిలాలు తొలగించారు. ఈ సంఘటనలో 9 మంది పిల్లలు మరణించారు. మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా పది నుంచి 15 ఏళ్ల వయస్సున్న పిల్లలని అధికారులు తెలిపారు. ఆలయం పక్కనున్న ఇల్లు సుమారు 50 ఏళ్ల నాటిదని చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఆ ఇంటి పురాతన గోడ కూలిందని వివరించారు.
మరోవైపు ఈ సంఘటన తనకు బాధ కలిగించిందని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.