సొంత రాష్ట్రానికి ప్రధాని మోదీ తాయిలాలు.. ఆర్నెళ్లలో 80,000 కోట్ల ప్రాజెక్టులు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌పై వరాల కుంభవృష్టి కురిపిస్తున్నారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై వేలకోట్ల నిధులు కుమ్మరిస్తున్నారు.
- సొంత రాష్ట్రానికి ప్రధాని మోదీ తాయిలాలు
- హోంమంత్రి అమిత్ షా వరాలు అదనం
- డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
- బీజేపీ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- స్వరాష్ట్రంలో గెలుపుకోసం దేశ సంపద
అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రానికి నిధుల వరద పారిస్తున్నారు. గుజరాత్ ప్రజలకు లెక్కలేనన్ని తాయిలాలు ప్రకటిస్తున్నారు. గత ఆరు నెలల్లోనే ఏకంగా రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. మోదీ నిధులకు అదనంగా అదే రాష్ర్టానికి చెందిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన పరిధిలో ఉన్నంతవరకు భారీగా సొంత రాష్ట్రానికినిధులు, ప్రాజెక్టులు తరలించుకుపోతున్నారు. ఉచితాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని మొత్తుకొంటున్న ఈ నేతలు, గుజరాత్ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అడ్డగోలుగా ఉచితాలు ప్రకటిస్తున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌పై వరాల కుంభవృష్టి కురిపిస్తున్నారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై వేలకోట్ల నిధులు కుమ్మరిస్తున్నారు. కేవలం ఆరు నెలల్లోనే ప్రధాని మోదీ ఒక్కరే గుజరాత్లో ఏకంగా రూ.80 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి నిధులు మంజూరు చేశారు. అదే రాష్ర్టానికి చెందిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రంపై ఎన్నికల ముందు అసాధారణ ప్రేమ చూపిస్తున్నారు. ఆయన పరిధిలో వందలకోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేశారు.
గుజరాత్‌తోపాటే హిమాచల్‌ప్రదేశ్‌కు, ఆ తర్వాత రెండుమూడు నెలల్లోనే మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, త్రిపుర అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కానీ, ప్రధాని మోదీ పరివారం మొత్తం గుజరాత్‌పైనే నిధుల వర్షం కురిపిస్తున్నది. ప్రజలకు ఉచితంగా ఏమీ ఇవ్వకూడదంటూ ప్రధాని నుంచి సామాన్య బీజేపీ కార్యకర్త వరకు ఇటీవల కాలంలో భారీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు గుజరాతీలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రధాని చేతికి ఎముక లేనట్టు వరాలు కురిపించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత ఆరు నెలల్లో గుజరాత్లో మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు
ఏప్రిల్ 20, 2022: రూ.22 వేల కోట్ల విలువైన పనులకు ఒక్కరోజే ప్రధాని శంకుస్థాపనలు చేశారు.
జూన్ 10, 2022: ప్రధాని మోదీ 12 ప్రాజెక్టులకు పునాది రాయి వేశారు. 14 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటి విలువ రూ.3,050 కోట్లు.
జూలై 15: గాంధీనగర్ రైల్వేష్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా రూ.790 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణంతోపాటు మొత్తం రూ.1,100 కోట్ల విలువైన పనులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.
జూలై 28: గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో ఉన్న సబర్ డెయిరీలో రూ.వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు.
ఆగస్టు 27-28, 2022: భుజ్‌లో రూ.4,400 కోట్ల విలువైన పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టులో భాగమైన కచ్ బ్రాంచ్ కెనాల్‌ను ప్రారంభించారు. రూ.18,300 కోట్ల విలువైన 2 సుజుకీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
సెప్టెంబర్ 29-30, 2022: ఒకేరోజు రూ.29,000 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఇందులో బావ్నగర వద్ద సీఎన్జీ టెర్మినల్, అహ్మదాబాద్ నగరంలో మొదటి దశ మెట్రో రైలు, సూరత్‌లో మొదటి దశ డైమండ్ రిసెర్చ్ అండ్ మర్కంటైల్ (డీఆర్ఈఏఎం), గాంధీనగర్-ముంబై మధ్య వందే భారత్ రైలు ప్రాజెక్టులు ఉన్నాయి.
బీజేపీ సర్కారుకు చెమటలు పట్టిస్తున్న ఉద్యమాలు
గత 22 ఏండ్లుగా గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీపై ప్రస్తుతం ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం కట్టలు తెంచుకొంటున్నది. వీళ్లు, వాళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ హక్కులు, ప్రయోజనాలకోసం రోడ్డెక్కుతున్నారు. ఏకంగా పోలీసులే వేతనాలు పెంచాలని ఏడాది కాలంగా పోరాడుతున్నారు. రైతులు, గ్రామ పట్వారీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, పశువుల కాపరులు, పాల ఉత్పత్తిదారులు, మాజీ సైనికోద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరూ బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు.
ఇన్నాళ్లూ ప్రభుత్వ అణచివేతతో మౌనంగా ఉన్న ఈ వర్గాలన్నీ ఎన్నికల ముందు తమ ప్రయోజనాలు కాపాడుకొనేందుకు భారీగా ఉద్యమాలు మొదలుపెట్టాయి. ఇటీవల పాల ఉత్పత్తి దారులు ఏకంగా తమ పశువులన్నింటినీ ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలి నిరసన తెలుపటం కలకలం రేపింది. నిన్నమొన్నటి వరకూ నోరెత్తితే గొంతు నొక్కటమే పనిగా పెట్టుకొన్న బీజేపీ సర్కారు, ఎన్నికల ముందు వ్యూహం మార్చి వారిని ప్రసన్నం చేసుకొనే పనిలో పడింది. అందుకోసం ఏకంగా నలుగురు మంత్రులతో ఓ కమిటీని కూడా వేయటం బీజేపీ ఎంతలా భయపడుతున్నదో తెలియజేస్తున్నది.
వణుకుతోనే వరాల జల్లు
గుజరాత్లో తమకు నూకలు చెల్లిపోయాయని బీజేపీ అగ్ర నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోని అసంతృప్తిని బలప్రయోగంతోనే ఆపవచ్చని ఆరు నెలల క్రితంవరకూ భావిస్తూ వచ్చింది. అది అసాధ్యమని తేలటంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కదని దాదాపు స్థిర నిర్ణయానికి వచ్చింది. దీంతో ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకొంటే లాభం లేదని ఏకంగా ప్రధానమంత్రి మోదీ, ఆయన అనుంగు అనుచరుడు అమిత్‌షా నేరుగా రంగంలోకి దిగారని విశ్లేషకులు అంటున్నారు. గత ఆరు నెలలుగా వారిద్దరూ దేశానికి పాలకులుగా కాకుండా గుజరాత్‌కు మాత్రమే పాలకులుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
2024లో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల ముందు వస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలువటం మోదీ, షాకు అనివార్యం. అందుకే 6 నెలలుగా ఆ రాష్ట్రంపై నిధుల కుంభవృష్టి కురిపిస్తూ ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ప్రజల్లో బీజేపీ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని నిర్ణయానికి వచ్చిన తర్వాతనే గత ఏడాది సెప్టెంబర్‌లో సీఎం విజయ్‌రూపానీ ప్రభుత్వాన్ని ఉన్నట్టుండి తొలగించి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో పూర్తిగా కొత్త ముఖాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయినా ప్రజల్లో ఆగ్రహావేశాలు చల్లారకపోవటంతో, వారిని ప్రసన్నం చేసుకొనేందుకు మోదీ, షా ద్వయం దేశ సంపదనంతా గుజరాత్‌వైపు మళ్లిస్తున్నదని మేధావులు అంటున్నారు.
గుజరాత్‌కు మరో రూ.14,600 కోట్లు
గుజరాత్‌పై ప్రధాని మోదీ మరో రూ.14,600 కోట్ల విలువైన వరాలు కురిపించనున్నారు. ఆదివారం నుంచి మూడురోజులపాటు గుజరాత్లో పర్యటిస్తున్న ఆయన, పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మెహసానా జిల్లాలోని మోధేరాలో రూ.3,900 కోట్ల పనులకు తొలిరోజే శంకుస్థాపన చేశారు. ఈ గ్రామాన్ని దేశంలోనే 24 గంటలూ సోలార్ విద్యుత్తును వాడే తొలి గ్రామంగా ప్రకటించారు. భరూచ్ జిల్లాలోని అమోద్‌లో నిర్మించిన రూ.8,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను సోమవారం ప్రారంభిస్తారు. జామ్‌నగర్‌లో రూ.1,460 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. అహ్మదాబాద్‌లో రూ.1,300 కోట్లతో నిర్మించే సివిల్ హాస్పిటల్‌కు మంగళవారం శంకుస్థాపన చేస్తారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

