Toll taxes | శ్రీనగర్, ఫిబ్రవరి 27: సక్రమంగా నిర్వహించని జాతీయ రహదారులపై(ఎన్‌హెచ్) ప్రయాణించే వాహనదారుల నుంచి టోల్ ట్యాక్సులు వసూలు చేయడం న్యాయం కాదని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రభావం చూపించే విధంగా ఎన్‌హెచ్‌లపై టోల్ వసూళ్ల బాదుడుకు సంబంధించి హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్‌హెచ్-44పై దారుణంగా రోడ్లు ఉన్న సెక్షన్లో టోల్ వసూళ్లను 80 శాతం తగ్గించాలని భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)ని హైకోర్టు ఆదేశించింది. రోడ్లు దయనీయంగా ఉన్న హైవేలో టోల్ ఫీజులు వసూలు చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. పఠాన్‌కోట్-ఉధంపూర్ సెక్షన్‌కు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ తాషీ రబ్స్తాన్, జస్టిస్ ఎంఏ చౌదరితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.